అమరావతి : ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో 6 లక్షల 2 వేల 537 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సహేతుక కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా విద్యార్థులను అధికారులు అనుమతించారు.
కేంద్రాల వద్ద 144సెక్షన్ ను విధించి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంకు తెలియజేయాలని అధికారులు కోరారు. వైఎస్ఆర్ జిల్లాలో పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 10 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించారు.
ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని మొరయించే ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.