అమరావతి : పేదవాడి ఆకలి తీర్చేందుకు టీడీపీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అడ్డు కుంటుండడంతో తెనాలి పట్టణంలో ఉద్రిక్తతలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది . ఇవాళ రోజు మాదిరిగానే తెనాలి మార్కెట్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో అన్నాక్యాంటీన్ నిర్వాహకులు ఆహార పంపిణీ చేపట్టారు. ఈ సెంటర్లో ట్రాఫిక్ సమస్య వస్తుందని మున్సిపల్ అధికారుల నిర్వాహకులకు నాలుగు రోజుల క్రితం నోటీసులు పంపారు.
టీడీపీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు పోటీగా అదే ప్రాంతం లో కొద్దిరోజుల నుంచి వైసీపీ నాయకులు కూడా ఆహార పంపిణీ చేస్తున్నారు. వీరి టెంట్లను కూడా తొలగించిన పోలీసులు టీడీపీ ఆహార పంపిణీకి ఆహార పదార్థాలను తీసుకొచ్చిన ఆటోను పోలీసులు తీసుకెళ్లారు. ఇరువురి మధ్య ఏదేని సమస్య రావచ్చని భావించిన పోలీసులు ముందు జాగ్రతగా మార్కెట్ సెంటర్లో మోహరించి ముందస్తుగా షాపులు మూయించారు.
ఇప్పటికే తెనాలి మార్కెట్ సెంటర్కు వెళ్లే మార్గాలు మూసివేశారు. మరోవైపు మార్కెట్ సెంటర్కు భారీగా వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల రావడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ టెంట్లను తొలగించి వైసీపీ క్యాంటీన్లకు అనుమతి ఇవ్వడం పట్ల టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహిం చారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ శ్రేణులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.