Chandrababu | జైలు నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తర్వాత 53 రోజులకు చంద్రబాబుకు బెయిల్ లభించింది.
చంద్రబాబు తనయుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరావు, టీడీ జనార్ధన్ తదితరులు జైలు వద్దకు చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.

టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో రాజమండ్రి పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ జైలు ఆవరణలోకి తోసుకు వచ్చారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కోసం పథకం అమలు చేశారు. అయితే, ఈ పథకంలో కుంభకోణం జరిగిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి, సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టు ఆదేశం మేరకు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.