టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏది చేసినా సంచనలంగానే ఉంటుంది. ఇటీవల ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడేమో ఏకంగా ఏపీ బీజేపీ ఇంఛార్జీ ఇంటికెళ్లి అక్కడ అర్ధ గంట సేపు గడిపారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి గణపతి పూజలో పాల్గొని హారతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఫొటోతో పాటు ఏపీ బీజేపీ ఇంఛార్జీ ట్వీట్ చేయడంతో కేశినేని నాని వ్యవహారం బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దియోథర్ ఇంటికి కేశినేని నాని వెళ్లారు. వినాయక చవితి వేడుకల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మిత్రుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఢిల్లీలోని తన ఇంటికి వచ్చినట్లు ధియోథర్ ట్విట్టర్లో వెల్లడించారు. గణపతి పూజలో పాల్గొన్న కేశినేని నాని ఫొటోను సైతం ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన నాయకుడి స్వగృహంలో జరిగిన వినాయకుడి పూజల్లో టీడీపీ ఎంపీ పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొంతకాలంగా కేశినేని నాని బీజేపీకి చేరువవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లుగా ఆయన ఢిల్లీలో సునీల్ దియోథర్ నివాసానికి వెళ్లడంపై టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.
టీడీపీ లైన్‌కు భిన్నంగా కేశినేని నాని వ్యవహరం ఉంటున్నదని విమర్శలు ఉన్నాయి. పార్టీ అధినాయకత్వం పట్ల కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్నారు. అయితే, అందరి ఊహలకు భిన్నంగా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే బయట పెడుతుంటారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకు చెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆయన బొకే ఇచ్చేందుకు నిరాకరించడం వివాదంగా మారింది.