(MP Kesineni Nani) విజయవాడ: వంగవీటి రాధను టీడీపీ ఎంపీ కేశినేని నానిని ఆయన ఇంట్లో కలిశారు. రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయం తెలుసుకున్న ఎంపీ నాని.. నెట్టెం రఘురాంతో కలిసి రాధా ఇంటికెళ్లి వివరాలు అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాధాకు నాని సూచించారు. రాధాకు టీడీపీ పూర్తిగా మద్ధతుగా ఉంటుందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో కేశినేని నాని మాట్లాడారు. వంగవీటి రాధాపై హత్యాయత్నం చేసేందుకు జరిపిన రెక్కీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎంపీగా వంగవీటి కుటుంబానికి రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని చెప్పారు. కొందరు వంగవీటి కుటుంబానికి అనుచరులుగా వ్యవహరిస్తూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో శాంతిభద్రతలను కాపాడేందుకు డీజీపీ, నగర సీపీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తన ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించారని స్వయంగా వంగవీటి రాధా ప్రకటించడం విజయవాడలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రాధాకు ప్రభుత్వం గన్‌మెన్‌ను నియమించింది.