Kesineni Chinni | ప్రజలను అర్థం చేసుకోకపోతే వైసీపీ మిగలదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పినప్పటికీ జగన్ ఇంకా మారలేదని విమర్శించారు. ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ అనుమానాలు వ్యక్తం చేయడంపై కేశినేని చిన్ని సీరియస్ కౌంటర్ ఇచ్చారు. బ్యాలెట్ పేపర్ కావాలని జగన్ కోరడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గతంలో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్పలేదా అని జగన్ను ప్రశ్నించారు. ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక ఈవీఎంలపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలన వద్దని ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పారని స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ భ్రమలు వీడి, ప్యాలెస్ నుంచి బయటకు రావాలని కేశినేని చిన్ని అన్నారు. ప్రజా జీవితంలోకి వస్తే.. ఇప్పుడు అయినా వాస్తవాలు తెలుస్తాయని విమర్శించారు. వైజాగ్ ప్యాలెస్ ఉదంతం బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చేవి కాదని అన్నారు. ప్యాలెస్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. దీనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరతామని చెప్పారు. దుర్వినియోగం చేసిన సొమ్మును చంద్రబాబు కక్కిస్తారని స్పష్టం చేశారు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయకుండా చట్టలు చేయాలన్నారు.