Gorantla | టీడీపీ సీనియర్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. తెలుగు దేశం పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఈసారి అయినా ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఆయన్ను వదిలేసి చాలామంది జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు.
పొత్తులతో కలిసి పోటీ చేసినప్పుడు ఎన్నో లెక్కలు ఉంటాయని.. వాటి వల్ల తనకు మంత్రి పదవి రాలేదని గోరంట్ల తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంపై తానేమీ బాధపడటం లేదని అన్నారు. అయితే మంత్రి పదవి వస్తుందని మాత్రం ఆశించానని గోరంట్ల తెలిపారు. రాజకీయ ప్రస్థానంలో ఆఖరి దశలో గుర్తింపు వస్తుందని భావించానని మనసులో మాట చెప్పారు. మంత్రి పదవి రాకపోతే ఏమవుతుందని.. ఇది వరకు పదవి ఉంటేనే పనిచేశామా అంటూ ఎదురు ప్రశ్నించారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఏ పదవి ఉందని పనిచేశానని అడిగారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. పనిచేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే పదవి ఉంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి రానందుకు తనకేమీ బాధ లేదని అన్నారు. స్పీకర్ పోస్టు ఇస్తారా? ఇంకేదైనా ఇస్తారా? అన్నది అధిష్ఠానం ఇష్టమేనని చెప్పారు.