Buddha Venkanna | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సూచించారు. సిగ్గు శరం ఏ మాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు బతికి ఉంటే.. ఆయన్ను జైల్లో వేస్తాం అంటావా అని మండిపడ్డారు. బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ పోలీసు కమిషరేట్ కార్యాలయంలో విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోరామని తెలిపారు. విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాను న్యాయస్థానానికి వెళ్లి అయినా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి విజయసాయి రెడ్డి ఏది వాగినా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
పరువు నష్టం దావా వేయడానికి అసలు విజయసాయి రెడ్డికి పరువు ఉందా అని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. బాధితులే ముందుకొచ్చి జగన్, వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. ఆ ఫిర్యాదుల మేరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటే సహించలేక నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.
కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఆదాయం వచ్చే ఆస్తులు ఎవరు అమ్మరని.. కేవీ దగ్గర అతి తక్కువ ధరకు భూమిని ఎలా తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. వైసీపీ నాయకుల అరాచకాలపై ఎంతోమంది బాధితులు ఇప్పుడు పోలీసులు, కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కేవీ రావు కూడా ఇదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. దానికి కులాన్ని అంటగడతారా అని మండిపడ్డారు.
కాకినాడ సెజ్ భూముల విషయంలో జగన్ తప్పు చేయలేదని నిరూపించే దమ్ము ఉందా అని విజయసాయి రెడ్డిని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైసీపీ తప్పులు, పాపాలను ఎత్తిచూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని మండిపడ్డారు.