Budda Venkanna | బుడమేరు వరదలను అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నారని ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నేతలపై వైసీపీ చేస్తున్న విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా వెళ్లారని.. ఇప్పుడు మళ్లీ అలాగే చేస్తే వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయమని విమర్శించారు.
వరదల సమయంలో బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు వల్లే ఈ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రజలు చెబుతుంటే.. వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని మండిపడ్డారు. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. దమ్ముంటే అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.
ప్రజలు వరదల్లో అల్లాడిపోతే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్ అని బుద్ధా వెంకన్న అన్నారు. ఏనాడైనా బురదలో అడుగుపెట్టి ప్రజలను కలిశావా? నువ్వా పేద ప్రజల గురించి మాట్లాడేదని మండిపడ్డారు. వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించిన వైఎస్ జగన్.. ఎవరికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. సిగ్గు శరం లేకుండా అసత్యాలు ప్రచారం చేస్తావా అని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నారంటూ ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే వైసీపీ నేతల కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేయడం అలవాటు చేసుకో.. కుట్ర కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.