Chandrababu | వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో ప్రచారం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా కేవలం ట్వీట్ చేసిన బన్నీ.. శిల్పా రవి కోసం ఏకంగా సతీమణితో కలిసి నంద్యాల వెళ్లి ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
అల్లు అర్జున్ వస్తే జనసేన జెండాలు పట్టుకుని ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరైనా చేస్తారా అని మండిపడ్డారు. అల్లు అర్జున్ మీ ఇంటికి రావడంలో తప్పు లేదు అని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని ఉద్దేశించి అన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పార్టీ జెండాలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా? కాదా? అని ప్రశ్నించారు. అన్నీ చెత్త రాజకీయాలు, చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటే.. చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడు.. అంతే తేడా అని విమర్శించారు. సండే ఎమ్మెల్యే.. శిల్పా రవి అంటూ ఎద్దేవా చేశారు. శిల్పా రవి గెలిస్తే కేవలం సండే మాత్రమే వస్తాడని.. ఇలాంటి వాళ్లను శాశ్వతంగా పంపించేద్దామని పిలుపునిచ్చారు.