రాజమండ్రి: టీచరో.. అధికారో బదిలీ అయితే అక్కడున్న వారు విషన్నవదనంతో వీడ్కోలు పలుకుతారు. అయితే, అమలాపురంలో ఈ సీన్ రివర్స్ అయింది. అప్పటిదాకా పనిచేసిన ఓ తహశీల్దార్ బదిలీ అయ్యారు. అలా సమాచారం అందిందో లేదో.. తహశీల్దార్ కార్యాలయం బయట బాణాసంచా సంబురాలు మిన్నంటాయి. దీనిపై ఆగ్రహించిన సదరు తహశీల్దార్.. ఇది కార్యాలయం సిబ్బంది పనే అంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో వారిని గుర్తించేందుకు సీసీటీవీలను జల్లెడపట్టే పనికి పూనుకునేలా చేశారు. దీనికి సంబంధించిన వివరాలాలి ఉన్నాయి.
కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం తహశీల్దార్ ఠాగూర్ సాధారణ బదిలీల్లో భాగంగా మరోచోటికి బదిలీ అయ్యారు. ఆయన బదిలీ సమాచారం అలా తహశీల్దార్ కార్యాలయం చేరగానే.. బయట బాణాసంచా కాల్చడం ప్రారంభమైంది. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. అధికారి బదిలీ అయితే బాధపడాల్సింది పోయి.. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకోవడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సదరు తాసిల్దార్.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో బాణాసంచా కాల్చింది ఎవరో తెలుసుకునేందుకు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.