తాడిపత్రిలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రిలోని అక్రమ నిర్మాణాల జాబితాను వెంటనే రెడీ చేయాలని సవాల్ విసిరారు. తాను కూడా ముందుండి మరీ.. ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరివి ఉన్నా… తమ పార్టీ వారివైనా సరే.. వాటిని కూల్చేస్తామని అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే ఓ అక్రమ నిర్మాణాల జాబితాను రూపొందించాలని, ఉగాది పండగ తర్వాత వాటిని కూల్చేస్తామని, ఆయనతో పాటు తాను కూడా ఉంటానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధికి అడ్డంపడకుండా వుంటే సరిపోతుందని చురకలంటించారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి, ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ సోదరులు 35 సంవత్సరాల పాటు అధికారంలో వున్నా… చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.