Macherla MLA Pinnelli | మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఫలితాల వెల్లడి రోజున కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది.
ఎలక్షన్ల సందర్భంగా మే 13న మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇటీవల ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఉండాలని మినహాయింపు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి హాని ఉందని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని.. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని అభిప్రాయపడింది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి.. పరిష్కరించాలని సూచించింది.