Chandrababu | ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరింది. ఆర్కే తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫోన్ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయారని.. ఆయనకు సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ.5కోట్లు ఇస్తానని, అదే గైర్హాజరైతే రూ.2 కోట్లు ఇస్తానని రేవంత్ రెడ్డితో బేరసారాలు జరిపించారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది.
రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ ఆర్కేను సుప్రీంకోర్టు మందలించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని హెచ్చరించింది. పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఈ సందర్భంగా ధర్మాసనం ఆరా తీసింది.
ఓటుకు నోటు వ్యవహారంలో సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది జాబితా ఇచ్చారు. కాగా ఆ కేసులకు ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసుల జాబితా చూసిన తర్వాత పిటిషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేవని స్పష్టంచేసింది.