తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సుందర రాజస్వామివారిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సుందర రాజస్వామి అవతార మహోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం జరిపారు. సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. అనంతరం వాహన మండపంలో శ్రీసుందరరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 నుంచి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర సిబ్బందితోపాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.