తిరుమల : టీటీడీ ( TTD) ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమల (Tirumala) ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం(Metlotsavam) ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భజన మండళ్లతో నామ సంకీర్తన, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలను వెల్లడిస్తారని ఆలయ అధికారులు వివరించారు.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. నవంబర్ 1న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుంచి స్వామిజీలు భక్త కోటికి ధార్మిక సందేశం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. అక్టోబర్ 31న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిణ అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారని తెలిపారు.
మహర్షులు, రాజర్షులు , పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తు అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే ఉన్నతాశయంతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టిందన్నారు.