తిరుమల : శ్రీవారి మెట్టు మార్గంలో 1,200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ (Token Scanning)ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం(Divya Darsan) టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా 1,200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలని అధికారులు వెల్లడించారు.
దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించబోమని వివరించారు. భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 79,584 మంది భక్తులు దర్శించుకోగా 31,848 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.18 ఆదాయం వచ్చిందన్నారు.