తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 22న ఉదయం 9 గంటలకు రోజుకు రెండువేల టికెట్లు చొప్పున ఆన్లైన్లో కోటాను విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందని వివరించారు.
7 కల్యాణమండపాల అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల
టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో నిర్వహిస్తున్న 7 కల్యాణ మండపాల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నందున 2023, మార్చి ఒకటో తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో ఎస్ఎంసి-226ఎ, ఎస్ఎంసి-226బి, ఎస్ఎంసి-237ఎ, ఎస్ఎంసి-237బి, ఎస్ఎంసి-248ఎ, ఎస్ఎంసి-248బి, ఎటిసి-99 కల్యాణ మండపాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి భక్తులకు అడ్వాన్స్ బుకింగ్ కేటాయిస్తామని తెలిపారు.