Srisailam | శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సాగుతుననాయి. ఉత్సవాలు తొమ్మిదో రోజుకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సిద్ధిదాయిని రూపానికి పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. సిద్ధిదాయినీదేవి అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉండి కుడివైపున చక్రం, గద, ఎడమవైపున శంఖం, పద్మాలను ధరించి ఉంటుంది. ఈ దేవిని ఉపాసించడం వల్ల అణిమ, మహిమ, అఘిమ మొదలుగు అష్ట (ఎనిమిది) సిద్ధులను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
సర్వదేవతలు, యక్షులు, గంధర్వులు, ఈ దేవిని సదా సేవిస్తుంటారని పండితులు పేర్కొన్నారు. ఈ అమ్మవారిని పూజించడంతో కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని పండితులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవల్లో భాగంగా రాత్రి కైలాస వాహనసేవ జరిగింది. వాహనసేవలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, కైలాస వాహనంపై వేంచేపు చేసి పూజాధికాలు చేశారు. అనంతరం ఆలయోత్సవం.. ఆ తర్వాత గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగాయి.
ప్రాతఃకాల, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్టాలు, చతుర్వేద పారాయాణాలు నిర్వహించారు. అలాగే, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా కుమారీ పూజలు చేశారు. రెండు సంవత్సరాల నుంచి పదేళ్ల వయసున్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించారు. రాత్రి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుంకుమపూజలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారల దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్స్, కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు మంచినీరు ఎప్పటికప్పుడు అందజేశారు.