Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 23 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,39,61,457 ఆదాయంగా వచ్చినటు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
అదే విధంగా 139.200 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 5.400 కేజీల వెండి ఆభరణాలు కూడా లభించాయని చెప్పారు. అలాగే, 481 యూఎస్ డాలర్లు , కెనడా డాలర్స్ 35, యూకే పౌండ్స్ 20, యూఏఈ దిర్హమ్స్ 140, మలేషియా రింగేట్స్ 15, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు 60, ఆస్ట్రేలియా డాలర్లు 60, ఖతర్ రియాల్స్ 45, జపాన్ యెన్స్ ఒకటి, సౌదీ అరేబియా కరెన్సీ 50, రోమనియా లియాస్ 10, ఉగండా షిల్లింగ్స్ 2వేలు, ఓమాన్ బైసా 600 సహా పలు దేశాలకు చెందిన కరెన్సీ హుండీ ద్వారా లభించినట్లు అధికారులు వివరించారు.