Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శివైక్యం పొందిన వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన కైలాస రథాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అధికారులను ఆదేశించారు. క్షేత్ర పరిధిలో దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందింతో పాటు స్థానికులు, భక్తులు మరణించిన సందర్భాల్లో పార్థీవ దేహాన్ని శానిటేషన్ ట్రాక్టర్లలో తీసుకువెళ్లడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. కైలాస రథం ఏర్పాటుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
అప్పటి వరకు నూతనంగా ఓ ట్రాక్టర్ వాహనాన్ని ఏర్పాటు చేసి అంతిమయాత్రలకు అనుమతించాలని సూచించారు. అదే విధంగా క్షేత్ర పరిధిలో మరణించిన వారిని ఖననం చేయడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని, పూడ్చడంతో పాటు సమాధులు నిర్మాణాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. కాశీ మహాక్షేత్రంలో కూడా మృతదేహాలను కేవలం ఖననం చేస్తున్నారని.. అదే విధంగా పలు అభివృద్ది చెందుతున్న మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా పూడ్చడం వంటి సాంప్రదాయాన్ని నిలిపివేస్తున్నారన్నారు. మృతదేహాలను పూడ్చి సమాధులు నిర్మించదలచిన వారు క్షేత్రానికి దూరంగా ఉండే గ్రామాల్లో అంత్యక్రియలు చేసుకునేందుకు కూడా దేవస్థానం వాహనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మల్లమ్మ కన్నీరు డంపింగ్ యార్డు వద్ద 50 సెంట్ల స్థలాన్ని ప్రత్యేకంగా స్మశానవాటికకు కేటాయించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వామిఅమ్మవార్ల దర్శనార్థం కాలినడకన వస్తూ మార్గమధ్యలో శివైక్యం చెందిన వారి బంధుమిత్రులకు సమాచారం అందించి వారి స్వస్థలాలకు మృతదేహాన్ని ఉచితంగా చేరవేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా శివ సన్నిధిలో ప్రాణాలు కోల్పోతున్న సాధువులు, యాచకులు, అనాధుల మృతదేహాల అంతిమయాత్రను దేవస్థానం బాధ్యతా హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులచే అంతిమ సంస్కారాలన్నీ శాస్ర్తోక్తంగా నిర్వహించేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో ఆజాద్ తెలిపారు. ఇలాంటి మహత్కార్యాన్ని తలపెట్టిన దేవస్థానం వారికి ధన, వస్తు రూపేణ విరాళాలు ఇచ్చేందుకు దాతలు నేరుగా ఈవో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.