Srisailam | శ్రీశైలం : రాబోయే వినాయక చవితి సందర్భంగా శ్రీశైలం ఆలయ పోలీసులు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు వినాయక మండపాల నిర్వాహకులు ఈ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఉత్సవ విగ్రహాల మండపాలు ట్రాఫిక్ అంతరాయం కలిగించని విధంగా ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. రాజకీయ ప్రకటనలు, పాటలు, ఉద్దేశపూర్వక నినాదాలు నిషేధం. కార్యక్రమాలు భక్తి భావంతో మాత్రమే జరగాలన్నారు. మండపాల్లో గాని, ఊరేగింపులో గాని అశ్లీల నృత్యాలు పూర్తిగా నిషేధమని తెలిపారు. రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ వినియోగించుకోవాలన్నారు. మండపంలో లైటింగ్ కోసం సరైన విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల కోసం సీసీ కెమెరాలు తప్పనిసరి అని.. రాత్రిపూట మండపం వద్ద కనీసం ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు బస చేయాలని సూచించారు.
ఊరేగింపులో అనుమతులు ఉన్న వాహనాలనే వినియోగించాలని.. డ్రైవర్ మద్యం లేదా మత్తు పదార్థాలు వాడరాదని పోలీసులు హెచ్చరించారు. విగ్రహం ఉన్న వాహనంలో చిన్నపిల్లలు ఉండకూడదని.. నిమజ్జన సమయంలో చిన్నపిల్లలు నీటిలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు. పోలీసుల అనుమతినిచ్చిన మార్గంలోనే ఊరేగింపు జరగాలని.. మార్గం మారిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.