Srisailam Temple | శ్రీశైలం : శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడోరోజైన బుధవారం భ్రమరాంబ దేవి కాళరాత్రి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. నల్లటి రూపంలో జుట్టు విరబూసుకుని భయంకరంగా దర్శనమిచ్చిన ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల విశ్వాసం. ఆదిపరాశక్తుల్లో ఏడవ రూపమైన కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక (ఇనుప ముండ్లు) ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ దేవిని స్మరించిన మాత్రానే భూతప్రేత, పిశాచాదులు భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అర్చకులు తెలిపారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనాన్ని అధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు వేదపండితులు శాస్ర్తోక్తంగా విశేష పూజాధి క్రతువులు చేసి వాహనసేవను నిర్వహించారు.
అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో భాగంగా గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారం నుంచి మంగళవాయిద్యాలు కళాకారుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలు, కేరళ పంచవాయిద్యాల మిశ్రమ ధ్వనులు భజనల నడుమ వైభవంగా క్షేత్ర పురవీధుల్లో విహరించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారితోపాటు ఈఈ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్ అనీల్‌కుమార్, సీఎస్‌వో అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు సంగీత విభావరిని భక్తులు ఆద్యంతం తిలకించారు. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారు అమ్మవారితో కలిసి నందివాహనంపై విహరిస్తారని ఈవో పెద్దిరాజు తెలిపారు.