Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన శనివారం భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకారమండపంలో షోడశోపచార పూజలు చేశారు. మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు.
ఉత్సవమూర్తులను గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలువీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం నేత్రానందంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులు జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబయి డోలు థేష్ వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. సమస్త సృష్టి క్రియా చైతన్యానికి ప్రతీక అయిన మయూరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శివుడికి వాహనంగా మారుటకు ఇద్దరిలోను ఉన్నది శివాంశ కావడమే అని విశ్వసించే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామల రావు దంపతులు, అర్చక వేదపండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని స్వామి అమ్మవార్లకు సమర్పించుకున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకొన్నారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడుతూ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి, శక్తిస్వరూపిణి భ్రమరాంబదేవికి బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ వెంకన్న తరఫున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదానానికి పచ్చళ్లను విరాళం ఇచ్చారు. గుంటూరు చిర్రావూరికి చెందిన విజయ ప్రొడక్షను కాటూరి రాము 2,400 కేజీల పచ్చళ్లను ఈవో శ్రీనివాసరావుకు విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు రూ.8,51,200 ఉంటుందని దాతలు తెలిపారు. దాతలకు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటి ఈవో రవణమ్మ, పీఆర్వో శ్రీనివాసరావు, అన్నదానం సిబ్బంది
ఉన్నారు.