Srisailam | శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన బుధవారం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్ఠానాలు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అలాగే, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించారు. సాయంకాలంలో జపాలు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపించారు.
రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా దేవస్థానంలో కుమారి పూజలు జరిగాయి. పూజల్లో భాగంగా రెండు సంవత్సరాల నుంచి పదేళ్లమ వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. కుమారిపూజ నవరాత్రి ఉత్సవాల్లో ఓ ముఖ్యమైన సంప్రదాయం. అమ్మవారు నవదుర్గ అలంకారాల్లో భాగంగా భ్రమరాంబ అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చారు. నవదుర్గలలో మూడవ రూపమైన ఈ దేవి దశ భుజాలను కలిగి ఉండి.. ప్రశాంతమైన వదనంతో సాత్విక స్వరూపిణిగా దర్శనమిచ్చింది. ఈ దేవి శాంతస్వరూపిణి అయినప్పటికీ యుద్ధోన్ముఖురాలై ఉండటం విశేషం.
ఈ అమ్మవారి మస్తకంపై అర్ధచంద్రుడు అలరాడుతున్న కారణంగా ఈ దేవిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. ఈ దేవిని పూజించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని.. దేవీ ఆరాధనతో సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు పండితులు చెబుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. తెనాలికి చెందిన ఎన్ వరలక్ష్మి బృందం భక్తిరంజని, విజయనగరానికి ఎస్ సుప్రియ బృందం కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.