తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) గురువారం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి(Kalyana Venkateswara Swamy) రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.
భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుందని అర్చకులు తెలిపారు. కాగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రేపు 8న చక్రస్నానం..
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు శుక్రవారం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం కార్యక్రమం ఉంటుందని టీటీడీ అధికారులు వివరించారు.