తిరుపతి : కర్ణాటక రాష్ట్రం రామనగరలోని జిల్లా స్టేడియంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఈ కల్యాణం దాతగా శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, ఆయన సతీమణి, స్థానిక శాసన సభ్యురాలు అనిత కుమార స్వామి దంపతుల సౌజన్యంతో కొనసాగింది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పుష్ప , విద్యుత్ అలంకరణల నడుమ కల్యాణ వేదికను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం జరిపారు. అనంతరం కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం అత్యంత వైభవంగా ముగిసింది.
ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీనివాస కల్యాణంలో మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ, సతీమణి చెన్నమ్మ దేవెగౌడ, టీటీడీ జేఈవో సదా భార్గవి,తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.