కడప ఎయిర్‌పోర్టు విషయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సోము వీర్రాజు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కడప వాసులను హంతకులు అనడం సరికాదని, సోము వీర్రాజు వెంటనే కడప ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనా, పార్టీ వైఖరిపైనా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
కడప ప్రజలు మనుషుల్ని చంపుతారని, వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు. కడప ప్రాంత ప్రజలను అవమానపరిచేలా చేసిన తన మాటలను వెంటనే వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ తన పబ్బం గడుపుకునేందుకు ఫ్యాక్షన్ గొడవలు రేపిందని ఆరోపించారు. మద్దెలచెరువు సూరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు వైఎస్సార్ తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు.