తిరుపతి : శ్రీ విశ్వావసు(Sri Vishwavasu ) నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ( BR Naidu) , జేఈవో వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తులకు అందిస్తుంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది.
టీటీడీ (TTD) ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట పూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖానస పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టా చార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. రాజాధి, నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టీటీడీలో నిర్వహించే విశేష ఉత్సవాల విషయాలను వివరించారు.
రూ.75 విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టీటీడీ సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుంచి పంచాంగం అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు.
బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ( Brahmotsavams) పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మంతో ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి ఆలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న శ్రీరామనవమి , పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఏప్రిల్ 9న హనుమంత వాహనం, 10న గరుడవాహనం, 11న శ్రీసీతారాముల కల్యాణం, 12న రథోత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు నటేష్ బాబు, గోవింద రాజన్, సీపీఆర్వో డాక్టర్ టి.రవి, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహర్, అధికారులు పాల్గొన్నారు.