తిరుపతి : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం (Vaikuntha Dwara Darsan) సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల (Tokens) జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
టీటీడీ (TTD EO) ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, బారీకేడ్లు, షెడ్లు, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతి(Tirupati), తిరుమలలో (Tirumala) జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నామని అధికారులు వివరించారు.
తిరుపతిలోని 8 కేంద్రాలలో 90కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారని వివరించారు. తదుపరి మిగిలిన రోజులకు 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలని కోరారు.