అమరావతి : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నియోజకవర్గంలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలు (Complaints Boxes )ఏర్పాటు చేస్తున్నానని ఏపీ హోంమంత్రి వంగలపుడి అనిత (AP Minister Anitha) పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేలా ప్రతి మండల కేంద్రంలోని ఎమ్మార్వో(MRO), ఎంపీడీవో (MPDO), కళాశాలలు, ప్రధాన కూడళ్లలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటుచేస్తానని వెల్లడించారు.
నాపేరు చెప్పి పేదలకు ఇళ్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందిస్తానని డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ లేఅవుట్లు,పేదల భూముల కబ్జాలాంటి ఘటనలకు పాల్పడితే సహించేదిలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నియమ, నిబంధనాల ప్రకారమే కేటాయింపులు చేయాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదుల పెట్టెను ప్రతి మూడు, ఐదురోజులకొకసారి తీసి వాటిని పరిశీలించి అధికారులకు పంపి పరిష్కరిస్తానని తెలిపారు.