కృష్ణా జిల్లా : సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ హత్యతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి (38) గా గుర్తించారు. హత్య విషయం సమాచారం అందుకున్న పమిడిముక్కల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని గుడివాడ డీఎస్పీ సదానందం, పమిడిముక్కల సీఐ ముక్తేశ్వర్రావు, ఎస్ఐ అర్జున్ సందర్శించి వివరాలు సేకరించారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాకమూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస రెడ్డి, భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. వర్క్ ఫ్రం హోమ్‌లో భాగంగా యాకమూరులోని ఇంటి నుంచి శ్రీనివాసరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. తన ఇంటి నుంచి సోమవారం రాత్రి ల్యాప్‌టాప్‌తో పునాదిపాడులోని స్నేహితుల వద్దకు శ్రీనివాస్‌రెడ్డి బయల్దేరాడు. కాగా, ఆళ్లవారిపాలెంలో శ్రీనివాస్‌రెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి, కత్తి లభ్యమయ్యాయి. హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి తోపాటు మిథున తన 10 నెలల చిన్నారితో పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింగి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితులుగా అనుమానిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, మిథున కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.
ఇలాఉండగా, ఆళ్లవారిపాలెంకు చెందిన మిథునతో శ్రీకాంత్‌రెడ్డికి కొన్నేండ్లుగా వివాహేతర సంబంధం ఉన్నది. శ్రీకాంత్‌రెడ్డి స్నేహితుడు శ్రీనివాసరెడ్డితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాకమూరులోని తన ఇంటి నుంచి స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆళ్వవారిపాలెంలోని మిథున ఇంటికి వచ్చి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు.