శ్రీ సత్య సాయి: అధికార పార్టీ నేతపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడిని అక్కడి ఎస్ఐ చితకబాదాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే..
శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని చిలమత్తూరుకు చెందిన వేణు అనే యువకుడు తన వికలాంగ తల్లికి పెన్షన్ మంజూరు కోసం తిరుగుతున్నాడు. అయితే, స్థానిక వైసీపీ నేత దామోదర్‌రెడ్డి ఆయనకు అడ్డంకులు సృష్టిస్తున్నాడు. తనకు కొంత మొత్తం చెల్లిస్తే పెన్షన్ వచ్చేలా చేస్తానని, లేదంటే పెన్షన్ రాదని దామోదర్ రెడ్డి చెప్పాడు. దాంతో దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు యువకుడు వేణు చిలమత్తూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. లంచం డిమాండ్ చేసిన వైసీపీ నేత దామోదర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని వేణు కోరగా.. అక్కడి ఎస్ఐ రంగడు ఒంటికాలిపై లేచి వేణును పట్టుకుని నాలుగు దెబ్బలేశాడు. అలాంటి చెత్త ఫిర్యాదులు తీసుకుని తన వద్దకు రావొద్దని హెచ్చరించి పంపాడు.
ఈ ఘటనను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువకుడిని చితకబాదిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన తన దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా పెనుగొండ డీఎస్పీ రమ్యశ్రీని నియమించారు.