తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) నూతన ఈవోగా శ్యామలరావు ( TTD EO ) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన శ్యామలరావు (Shyamala Rao) దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో స్వాగతం పలుకగా ఆలయ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవోగా తనను బదిలీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు (Chandra Babu) కు ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిని సారించి పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామని వెల్లడించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే బోర్డు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
ఏపీలో తెలుగుదేశం (Telugu desam) కూటమి అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని సెలువుపై వెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన తరువాత విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న శ్యామలరావును టీటీడీ ఈవోగా బదిలీచేయడంతో ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు.