Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం (11.12.2024) నుంచి కార్తీక మాస శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఐదు రోజుల పాటు ఈ దీక్షా విరమణ కొనసాగుతుంది. ఈ నెల 15న శివ దీక్షా విరమణ ముగుస్తుంది. పాతాళ గంగ మార్గంలోని శివదీక్షా శిబిరాల్లో ఈ దీక్షా విరమణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గత నెల రెండో తేదీన శివ మండల దీక్ష, 21న అర్ధ మండల దీక్ష స్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో దీక్ష విరమించవచ్చునని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ దీక్షా విరమణ సందర్భంగా బుధవారం ఉదయం 7.30 గంటలకు స్వామి ఆలయ దక్షిణ ద్వారం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో ఆశీసులను చేయించి విశేష పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. తర్వాత స్వామి అమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి శివదీక్షా శిబిరాల్లో వేంచేబు చేయించడం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో దీక్షా విరమణ చేసే భక్తుల కోసం మూడు వంతులుగా సిబ్బందికి శివ దీక్షా శిబిరాల్లో ప్రత్యేక విధులు కేటాయించారు.
శివదీక్షా ప్రాశస్త్యానికి మన పురాణాల్లోనూ, వ్యవహారిక గాథల్లోనూ ఎంతో ప్రాశస్త్యం ఉంది. చారిత్రకంగా కూడా ఈ శివ దీక్షకు ఆధారాలు ఉన్నాయి. బాదామి చాళుక్య రాజైన రెండవ విక్రమాదిత్యుడు ఆంగ్లశకం 660 సంవత్సరంలో శివ మండల దీక్ష స్వీకరించారని పురాణాలు చెబుతున్నాయి. దీక్ష ఇచ్చిన శివ గురువు సుదర్శనాచార్యునికి వంగూరు సీమలోని (ప్రస్తుత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) ఇపరుంకల్ అనే గ్రామానికి గురు దక్షిణగా ఇచ్చినట్లు, ఆలంపూర్ మండలం ఆముదాల పాడులో లభించిన విక్రమాదిత్యుని తామ్ర శాసనం చెబుతోంది.