అమరావతి : వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి ( Vijayasai reddy ) రాజీనామాపై అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని వైసీపీ ( YCP ) కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని స్వయంగా విజయసాయి చెప్పారని తెలిపారు. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో జగన్‌కు తెలుసని, ఆయనొక టార్చ్‌బేరర్ అని అన్నారు. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుందని, కొంత మంది తట్టుకుంటారు. మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదని, రెడ్‌బుక్ (Redbook) రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల హక్కులను వైసీపీ కాపాడుతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు (Chandra babu ) పర్యటించి పెట్టుబడులు రాకపోయేసరికి మాట మార్చారని దుయ్యబట్టారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu) జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.