ఖైరతాబాద్ : కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ఈనెల 15న సెక్రటేరియట్ ముట్టడికి(Secretariat siege) తరలిరావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు, విద్యార్ధి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షులు రాజారాం యాదవ్ (Rajaram Yadav) వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెక్రటేరియట్ ముట్టడి పోస్టర్ల(Posters) ను రాజ్యాసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, ఓయూ విద్యార్ధి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఏల్చల దత్తాత్రేయ, టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలన్నారు. బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతుంది. ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. సమగ్ర కుల గణన చేస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కులగణన చేయకుండానే ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు.
కులగణన, ఉద్యోగాల ప్రకటనలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొనుగోళ్లలో సీఎం బీజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పిన ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నజాడ కనిపించడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు : ఆర్. కృష్ణయ్య
నిరుద్యోగ సమస్య, కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీ పదవుల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలకు స్థానిక సంస్థల్లోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.