అమరావతి : గోదావరి నది ఉధృతి పెరుగుతుండడంతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఎగువ భాగాన నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 14.30 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండగా డెల్టా పంట కాల్వలకు 4వేల క్యూసెక్కులు నీటిని, సముద్రంలోకి 13.57 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రహదారిపై రాకపోకలు స్థంభించాయి . ముందు జాగ్రత్తగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి సహయం చేసేందుకు అధికారులు కోనసీమ జిల్లాలో 4 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులు రద్దు
మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040 -69440000, 040-23450033 ను సంప్రదించాలని సూచించారు.