తిరుపతి జిల్లా : పాఠశాలలో ల్యాబ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులంతా 9 వ తరగతికి చెందినవారే. ఈ ఘటన బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఉన్నత పాఠశాలలోని ఫిజిక్స్ లేబొరేటరీలో జరిగింది.
బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ స్మారక ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నాలుగు తరగతి గదులను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ గదులు అందుబాటులోకి రానున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ల్యాబ్‌లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రయోగాలను వివరిస్తున్న సమయంలో పైకప్పు ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో జస్వంత్ అనే విద్యార్థికి రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరో ముగ్గురు విద్యార్థులు తేజ్ ప్రభాస్, సంతోష్, మోహిత్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన జస్వంత్‌ను స్విమ్స్‌కు తరలించగా పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
స్కూల్ పైకప్పు కూలిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి పాఠశాలను సందర్శించి సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. పాఠశాలలోని అన్ని తరగతి గదుల పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. పైకప్పు కూలిన ల్యాబ్ గదికి తాళం వేయాలని ఆదేశించారు. అనంతరం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న జస్వంత్‌ను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాల పాత భవనంలోని ల్యాబ్ గది సీలింగ్ కూలిపోయి ఒక విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయని కమీషనర్ అనుపమ అంజలి మీడియాకు తెలిపారు. వీలైనంత త్వరంగా నిర్మాణంలో ఉన్న నాలుగు తరగతి గదులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.