తిరుమల : తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshan ) కలుగుతుందని అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా 34,985 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీ (Hundi) కి రూ. 4.01 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
ఆగస్టు 30న కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 30వ తేదీన కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు.