తిరుమల : తిరుమల(Tirumala )లో పారిశుధ్య కార్మికులు(Santiation Workers ) చేస్తున్న సమ్మె వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం టీటీడీ ఈవో ఆదేశాల మేరకు టీటీడీలోని 8 వేల నుంచి 10 వేల మంది పర్మినెంట్(Permanent), కార్పొరేషన్ ఉద్యోగుల్లో(Corporation Employees) 600 నుంచి 700 మంది పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.
క్లిష్ట సమయంలో తమ సంస్థ ప్రతిష్ట కాపాడుతూ భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు ఉద్యోగులు ముందుకురావడం అభినందనీయమని అన్నారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలవాలని ఆయన కోరారు శుద్ధ తిరుమల- సుందర తిరుమలగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు .
ఈ నెల 22వ తేదీన 1600 మంది సులభ ఏజెన్సీ(Sulabh Agency)లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు టీటీడీ యాజమాన్యానికి తెలియజేయకుండా సమ్మెకు వెళ్లారన్నారు. దీంతో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు కార్పొరేషన్లు , స్విమ్స్, బర్డ్ సంస్థల నుంచి పారిశుధ్య కార్మికులను సమీకరించి ఎనిమిది రోజులుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో డిప్యూటేషన్ డ్యూటీ వేసినట్లు ఈవో వెల్లడించారు.
ఇందులో ఈవో, జేఈవోలు, సివిఎస్వో , డిప్యూటీ ఈవో లు , సూపరింటెండెంట్లు , ఎగువ, దిగువ శ్రేణి గుమస్తాలు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు ఉన్నారన్నారు. వీరందరికి ప్రతినెల మూడుసార్లు తిరుమలలో డ్యూటీలు వేశామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇచ్చామని, వీరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కార్మికులను సమీకరించి తీసుకొస్తున్నారని చెప్పారు. వీరికి కనీస వేతనాలు, అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, శ్రీవారి దర్శనం, సబ్సిడీపై లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.