అమరావతి : విభజిత రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Chandra Babu) క్యాబినేట్లో మొదటిసారి బెర్త్‌ను దక్కించుకున్న 20 మందిలో ఆ ముగ్గురికి మరోసారి మంత్రి వర్గంలో చోటు దక్కింది . 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు క్యాబినెట్లో 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు.
2014లో కొల్లు రవీంద్ర (Kollu Ravindra) బీసీ సంక్షేమం, ఎక్సైజ్, చేనేత మంత్రిగా పని చేయగా, 2024 నూతన క్యాబినేట్లో గనులు, ఎక్సైజ్శాఖలను కేటాయించారు. పొంగూరు నారాయణ (Ponguru Narayana) కూడా 2014 క్యాబినేట్లో మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు మంత్రిగా పనిచేయగా నేడు కూడా ఆవే శాఖలు ఆయనకు దక్కాయి.
ఇక కింజారపు అచ్చెన్నాయుడు(Achennaidu) కార్మికశాఖ, పరిశ్రమలు, యువత, క్రీడలు , వృత్తి నైపుణ్యం మంత్రిగా పనిచేయగా 2024లో వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలను ముఖ్యమంత్రి కేటాయించారు. ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌కు 2017లో ఐటీ, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్‌గా పనిచేయగా నేడు ఆయనకు ఐటీ , మానవవనరులు, ఆర్టీజీ శాఖలను కేటాయించారు.
2014లో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత 2024లో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వారికి మంత్రివర్గంలో అవకాశం రాలేదు.