అమరావతి : ఎర్రకోటలో ప్రధాని మోదీ ( Narendra Modi ) ప్రసంగంపై సీపీఐ శాఖ తీవ్రంగా ఖండించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ( RSS ) పాత్ర శ్లాఘనీయమని మోదీ పేర్కొనడం విచారకరమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి (CPI Secretary ) రామకృష్ణ ( Ramakrishna ) అన్నారు. 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మోదీ శుక్రవారం జెండా ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డిన భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్ పేర్లను ప్రస్తావించకపోవడం శోచనీయమని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలది తిరుగులేని పాత్ర అని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ ప్రమేయమేమి లేదని అన్నారు. దేశంలో పేదరికం తగ్గిందని ప్రస్తావించడం విచారకరమని పేర్కొన్నారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఒక అంబక్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. పోలవరం ఎత్తును పెంచి 196 టీఎంసీల నీటిని నిలువ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మరో మూడు వేల బస్సులను కొనుగోలు చేసి మహిళలకు అందుబాటులో ఉంచాలని కోరారు.