తాడేపల్లి: రోడ్లు, భవనాల శాఖపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2,205 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ఇలాంటి సందర్భం గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ లేదన్నారు. విశాఖ బీచ్ కారిడార్ రోడ్డుపై కూడా సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరిపారు.
గత ప్రభుత్వం రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని సీఎం అన్నారు. తర్వాత వర్షాలు కురియడంతో బాగా దెబ్బతిన్నాయని, దీంతో ఈ ప్రభుత్వం హయాంలోనే రోడ్డన్నీ పాడైపోయినట్లు వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీచ్ కారిడార్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచేలా తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు వీలైనంత త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 83 శాతం రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. నెలఖరుకు 100 శాతం టెండర్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. 33 ఆర్వోబీలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పారు.
సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రవాణాశాఖ కమిషనర్ పీ సీతారామాంజనేయలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.