Junior NTR | జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించారు. అరచేతితో సూర్యుడిని ఆపలేరని.. అలాగే ఎన్టీఆర్ సినిమాలను కూడా ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలని అనుకోవడం హాస్యాస్పదమని చెప్పారు.
ఈవీఎంలను మార్చి, కోట్లాది మంది ప్రజలను మోసం చేసినంత సులువుగా సినిమా ప్రదర్శనలను అడ్డుకోలేరని ఆర్కే రోజా తెలిపారు. సినిమా బాగుంటే హిట్ అవ్వకుండా ఎవరూ అడ్డుకోలేరని.. అదే సినిమా బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని పేర్కొన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందని తెలిపారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసినా.. ఫ్రీగా టికెట్లు పంచినా కూడా హరిహర వీరమల్లు సినిమాను జనాలు చూడలేదు కదా అని సెటైర్ వేశారు. స్వయానా పవన్ కల్యాణ్ అభిమానులే ఆ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లలేదని సెటైర్లు వేశారు.
రాజకీయాలను రాజకీయంగానే చూడాలని, సినిమాలను సినిమాలుగానే చూడాలని ఆర్కే రోజా సూచించారు. సినిమా ఫంక్షన్లలో వైఎస్ జగన్‌ను తిట్టి, సవాళ్లు చేస్తే గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు సినిమాలు ఎలా ఫ్లాప్ అయ్యాయో చూశామని తెలిపారు. కాబట్టి సినిమాలను రాజకీయాలను మిక్స్ చేయకండని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో లేరని.. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. ఆయన సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయో.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ఎన్టీఆర్ సినిమాలను అపాలని టీడీపీ నేతలు మాట్లాడుకోవడం విని జనాలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.