RK Roja|సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు.. సూపర్ ప్లాప్ అని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ఆరోపించారు. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో కూటమి నేతలు చేసిన స్కిట్‌ను ప్రజలందరూ చూశారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండేళ్ల రాష్ట్ర సంపదను దోచుకుని ప్రజలకు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కూటమికి ఎందుకు ఓట్లు వేశామా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు.
కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని ఆర్కే రోజా విమర్శించారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు అనుకున్నారా అని ప్రశ్నించారు. అదే జగన్ మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చూశారన్నారు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
షూటింగ్‌లు చేసుకోవడానికి కాదు పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఓట్లు వేసిందని ఆర్కే రోజా విమర్శించారు. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్‌లో తిరగడానికి కాదు పవన్‌కు ఓట్లు వేసిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను జనసేన అధినేత పట్టించుకోకుండా ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. బుర్ర ఉన్న వెదవ ఎవరూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వరని.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తల ఆడించారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని మండిపడ్డారు.
హోంమంత్రి అనిత మెడికల్ కాలేజీల విషయంలో చూపించింది ప్రజెంటేషన్ కాదు.. ఫ్రస్ట్రేషన్ అని రోజా విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు మెడికల్ కాలేజీల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్లుగా మంత్రి సవిత తీరు ఉందని ఎద్దేవా చేశారు. మొదటి సారి ఎమ్మెల్యే, మంత్రి అయినప్పటికీ.. తమ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం చేతకావడం లేదని విమర్శించారు. నేను రాజమండ్రి, విజయనగరం, పాడేరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల దగ్గరకు వస్తాను.. దమ్ముంటే మంత్రులు అక్కడికి రావాలని సవాలు విసిరారు. వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను చూపిస్తానని తెలిపారు.
అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని రోజా విమర్శించారు. చంద్రబాబుకు విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉందని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలంటే ఏడేళ్ల సమయం పడుతుందని.. ఎయిమ్స్ పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టిందని తెలిపారు. మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయనే కనీస అవగాహన కూడా మంత్రులకు లేదని విమర్శించారు. కొవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కొవిడ్ సమయంలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేశ్ మెప్పు పొందడం కోసం మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ బెంగళూరులో ఉంటే.. ఓడిపోయినప్పుడు టీడీపీ, జనసేన ఎక్కడ ఉన్నారని నిలదీశారు.