Ramgopal Varma | ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కున్నారని జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఆర్జీవీకి దమ్ము ధైర్యం ఉంటే పోలీసులకు లొంగి పోవాలని సవాలు విసిరారు.
పోలీసుల సెక్షన్లు తనకు వర్తించవని ఆర్జీవీ అంటున్నారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఐపీసీ, బీఎన్ఎస్ చట్టాలు కాకుండా ఆర్జీవీకి వైసీపీ సెక్షన్లు కావాలేమో అని విమర్శించారు. ఇష్టమొచ్చినట్లు బతుకుతానంటే చట్టం ఒప్పుకోదని స్పష్టం చేశారు. కూటమి నేతలకు భయపడి తాడేపల్లి డెన్‌లో ఉన్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ నుంచి ఆర్జీవీ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
వ్యూహం సినిమా ప్రమోషన్ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై తాజాగా ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రామ్‌గోపాల్ వర్మ ఆచూకీ కోసం గాలిస్తుండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్‌మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను కేసులకు భయపడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పస్టం చేశారు.
గత ఏడాది చేసిన ట్వీట్ల కారణంగా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం విచిత్రంగా ఉందని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తాను ఎవరిపై పోస్టులు చేశారో వారికి కాకుండా వేరే వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. పోలీసుల్ని రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. మర్డర్ కేసుల్ని ఏళ్ల తరబడి పట్టించుకోరు.. కానీ ఇటువంటి కేసులకు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చిందని ప్రశ్నించారు. తాను పరారీలోలో లేనని.. మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపారు.