తిరుమల కొండపై ఇకపై ప్రైవేట్ హోటళ్లు కనిపించకుండా పోనున్నాయి. కొండపై ప్రైవేట్ హోటళ్లను తొలగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయం తీసుకుంది. గురువారం టీటీడీ పాలకమండలి సమావేశమై సిఫారసు లేఖల ఆర్జిత సేవా టికెట్లపై ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఉపయోగపడే మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అదే తిరుమల కొండపై ప్రైవేట్ హోటళ్లు లేకుండా చూడటం.
తిరుమల కొండపై ప్రైవేట్ హోటళ్లు తొలగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండపై ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకేరకమైన భోజనం అందుబాటులోకి తేనున్నారు. దైవ దర్శనానికి వచ్చేది ముఖ్యమంత్రి అయినా, సాధారణ భక్తుడైనా, వీఐపీలైనా.. అందరూ టీటీడీ అన్నప్రసాదం తినాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ఏపీ టూరిజంకు కేటాయించడంపై కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ ఉన్న రెస్టారెంట్లకు టీటీడీ ఆక్షన్ నిర్వహించి టెండర్లు వేసిన వారికి కేటాయించారు. ఈ నేపథ్యంలో వారిని ఖాళీ చేయించేందుకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ప్రతిఒక్కరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే నిర్ణయం కూడా వివాదాస్పదంగా తయారైంది. ఇక్కడి వచ్చే వివిధ ప్రాంతాల భక్తులకు వారికి కావాల్సిన ఆహారాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని తొలగించడం సరైంది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ.
అలాగే, త్వరలో సాధారణ భక్తులకు పూర్తిస్థాయిలో సర్వదర్శనాలను తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు చేపడతామన్నారు. తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల కోసం ఈ ఏడాది డిసెంబర్‌లోగా రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.