Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. బుధవారం ఉదయం ఆరు గేట్లతో నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అన్ని గేట్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూరాల క్రస్ట్ గేట్ల ద్వారా 1,05,870 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,106 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం ద్వారా 17,916 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదల కాగా.. సాయంత్రానికి 1,21,096 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు వచ్చి చేరింది. కుడి ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,116 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 883.90 అడుగులు కాగా జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 209.1579 టీఎంసీలుగా నమోదైంది.