అమరావతి : చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్ పెరుమాళ్ తిరుపతి నుంచి వేలూరుకు కారులో వెళ్తుండగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన వంద ఎర్రచందనం దుంగలను, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. మరో వాహనంలో ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు.
ఇతడిపై చిత్తూరులో కాకుండా మరికొన్ని జిల్లాలోనూ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఒక హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ తెలిపారు. తిరుపతి -బెంగళూరు రోడ్డు చెర్లోపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన పెరుమాళ్‌ను విచారించగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడని తెలిపారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.